ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ మధు, మావోయిస్టు పత్రిక జంగ్ ఎడిటర్ నవీన్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
నంబాల కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని జియన్నపేట. 1955లో కేశవరావు జియన్నపేటలో జన్మించారు. కేశవరావుకు ఓ సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ ఆర్‌ఈసీలో బీటెక్ సీట్ రావడంతో జాయిన్ అయ్యారు. కేశవరావు బీటెక్ చదువుతుండగానే.. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్యూ)వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సీపీఐ పీపుల్స్‌వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై.. ఎంటెక్ మద్యలోనే ఆపేసి ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి 43 ఏళ్లుగా కేశవరావు మావోయిస్టు రూపంలో అజ్ఞాతంలోనే ఉన్నారు.
Also Read: China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
1980లో ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు నంబాల కేశవరావు కీలక నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్ అతనే. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో దాడుల వెనుక ఆయన హస్తం ఉంది. ఏపీలోని ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు కేశవరావు ప్రాధాన సూత్రధారిగా ఉన్నారు. 2010 దంతేవాడలో జరిగిన 76 మంది సిఆర్పిఎఫ్ సభ్యుల బ్లాస్ట్ కు సైతం అతనే సూత్రధారి. మిలటరీ దాడుల వ్యూహకర్తగా కేశవరావుకు మంచి పేరుంది. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉంది.