ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాన్షీరామ్‌కు భారతరత్న ప్రకటించాలని బీఎస్సీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. అనంతరం బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి కూడా ప్రకటించింది. ఇక తాజాగా శుక్రవారం మరో ముగ్గురికి కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan)ను అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్రం గౌరవించింది. ఈ నేపథ్యంలో దళిత నేత అయిన కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ప్రకటించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’లో ట్వీట్ చేస్తూ కేంద్రాన్ని కోరారు.
నిర్లక్ష్యానికి గురైన దళితుల ప్రయోజనాల కోసం కాన్షీరామ్ చేసిన పోరాటం తక్కువేమీ కాదని.. ఆయనను కూడా భారతరత్నతో సత్కరించాలని మాయావతి విజ్ఞప్తి చేశారు. ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రదానం చేసే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను నిర్లక్ష్యం చేసిందనిమాయావతి ఆరోపించారు.
కేంద్రం ప్రకటించిన భారతరత్నాలను స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. కానీ దళితులను తృణీకరించడం సరైంది కాదని హితవు పలికారు. దళితులపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని ఆమె కోరారు.