కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు రైతుల పక్షాన పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై ‘ రైతు ధర్నా’ పేరుతో బీఆర్‌ఎస్ పోరాటానికి సిద్దమైంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రైతు ధర్నా, నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో రైతు ధర్నా చేపట్టింది.
షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉదయం 11 గంటలకు జరిగే రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ శ్రేణులు రైతు ధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రైతు ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read: Fire Accident: షేక్‌పేట్ రిలయన్స్ ట్రెండ్స్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు!
రైతు ధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతు ధర్నా కార్యక్రమ ఏర్పాట్లను పట్నం నరేందర్‌రెడ్డి, పట్నం అవినాశ్‌రెడ్డి సహా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పట్లోళ్ళ కార్తీక్‌రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. రైతులను, ప్రజలను పెద్దఎత్తున తీసుకువచ్చి.. రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు రైతు ధర్నా నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.