శాసనమండలి ఆవరణలో ‘రైతు రుణమాఫీ’ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని.. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కనపెట్టారని మధుసూదన చారి మండిపడ్డారు. చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని సుభాష్ రెడ్డి అన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ ఇచ్చింది. అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీని పక్కనపెట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఉంది. కాంగ్రెస్ పాలనలో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ నాయకత్వంలో రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’ అని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి అన్నారు.
‘చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారు. మేం ఏదైనా మాట్లాడితే.. మా గొంతు నొక్కుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు. రైతులు ఇబ్బంది పడవద్దని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను పక్కన పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి’ అని ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.