దులీప్ ట్రోఫీ 2024 ఈరోజు అనంతపురంలో ప్రారంభమైన విషయం సంగతి తెలిసిందే.. ఇండియా B తరపున ఆడుతున్న అన్న సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి మ్యాచ్‌లో విఫలమయ్యారు. కానీ అతని తమ్ముడు ముషీర్ ఖాన్ శతకంతో మెరిశాడు. ముషీర్ ఖాన్ కూడా దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ముషీర్ ఖాన్ తొలి సెంచరీ సాధించాడు. ఇది.. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మూడవ సెంచరీ. ముషీర్ ఖాన్ తొలిసారిగా దులీప్ ట్రోఫీలో ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు.
Read Also: Vijayawada Floods: బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన..
ముషీర్ ఖాన్ 205 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ ఖాన్ వయసు 19 ఏళ్లే.. కానీ అతను చూపించిన ఆట తీరు చూస్తే చిన్న వయసులోనే ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్‌గా ఆడినట్లు అనిపిస్తుంది. అతని అన్న సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరఫున టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఈ మ్యాచ్‌లో అతను 35 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ముషీర్ సెంచరీ చేయడంతో సర్ఫరాజ్ చాలా సంతోషించాడు.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు సినీ ప్రముఖులు ఎంతెంత విరాళం ఇచ్చారంటే?
కుర్లాలో జన్మించిన ముషీర్ ఖాన్ ఆల్ రౌండర్. బ్యాట్‌తో పాటు బంతితో జట్టుకు సహకారం అందిస్తున్నాడు. ముషీర్ ఖాన్ ఇప్పటివరకు 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. తన 10 ఇన్నింగ్స్‌లలో 529 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. బరోడాతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ముషీర్ ఖాన్ 203 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అంతే కాకుండా ఫైనల్‌లో సెంచరీ చేసిన అతను ఇప్పుడు దులీప్ ట్రోఫీ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు.