అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో భాగమయ్యాడా? అని అడిగారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. మండలి చైర్‌లో ఒక దళితుడు కూర్చున్నాడని అవమానించాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు కాపాడాలని, కానీ చట్టసభల్లో ఇలా జరగటం దురదృష్టకరం అని మండలి విపక్షనేత బొత్స పేర్కొన్నారు.
‘సభలో నారా లోకేష్ మమ్మల్ని ఎవరేం పీకుతారు అన్నారు. వాళ్ళ వ్యవహారశైలి అలాగే ఉంది. మాజీ ముఖ్యమంత్రి అన్నా గౌరవం లేదు, సినీ పరిశ్రమకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అన్న గౌరవం లేదు. బాలకృష్ణ పెద్ద పూడింగి అనుకుంటున్నారు. ఏం చూసి మీ అహంభావం. వాళ్ళ పార్టీ నుంచి ఇంతవరకు వివరణ లేదు. స్పీకర్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతాడు.. ఎందుకు స్పందించలేదు. ఒక మాజీ సీఎం, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని అవమానిస్తే పట్టించుకోరా?. మేం కేవలం సభా సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం. చిరంజీవికి అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది మాకు అనవసరం, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అని మండలి విపక్షనేత బొత్స అన్నారు.
Also Read: CM Chandrababu: లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!
‘శాసనసభ, మండలిని ఏ ప్రభుత్వం కూడా స్వప్రయోజనాల కోసం చూడలేదు. చంద్రబాబు నాయకత్వంలో ఉభయ సభలను తమ జేబు సంస్థగా చూస్తున్నారు. మండలి సభ్యులకు రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు ఇవ్వటం లేదు. మండలి చైర్మన్ కు కూడా ప్రోటోకాల్ కూడా ఇవ్వటం లేదు. మండలిలో ఇదే అంశంపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. నిన్న అసెంబ్లీ సముదాయంలో ఒక బిల్డింగ్ ప్రారంబించారు. ఆ శిలాఫలకాల మీద వాళ్లకు సంబంధించిన ముఖ్యల పేర్లు వేయించారు, ఎక్కడా చైర్మన్ పేరు లేదు. వీరికి రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం లేదు. తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు లోక్ సభ స్పీకర్ వచ్చారు. ఆ కార్యక్రమానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ లకు ఆహ్వానించారు. కనీసం సంప్రదాయం ప్రకారం అయినా గౌరవించాలి. జీవో 59 ప్రకారం మండలి చైర్మన్ ను ఆహ్వానించాలి. ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తున్నారు. ఇది జేబు సంస్థా లేక టీడీపీ ఆఫీసా. అసెంబ్లీని రాజకీయాలకు వాడుకోవటాన్ని ఖండిస్తున్నాం. సభ్యులకు పెట్టిన క్రీడా పోటీల్లో కూడా చైర్మన్ ను గౌరవించలేదు. దీనికి ఎవరు బాధ్యులు అని సీఎం సమాధానం చెప్పాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దేవాలయం లాంటి ప్రాంగణాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు నిరసనలు కొనసాగుతాయి’ అని బొత్సహెచ్చరించారు.