Father Killed Girl Child in Maharashtra: ప్రపంచం చాలా ముందుకు వెళుతుంది. ఇది టెక్నాలజీ యుగం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అమ్మాయిలు ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు. ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటూ ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే ఈ దేశంలోనే ఆడపిల్ల పుట్టిందని కుప్ప తొట్టిలో పడేసేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఆ శిశువును చంపేశాడు ఓ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్ గావ్ జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read: Multibagger Stocks: రూ.19 పెట్టి ఈ షేర్ కొంటే.. 6 నెలల్లో రూ.48 కోట్లు సంపాదించి పెట్టింది
వివరాల ప్రకారం పహూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ తండాలో గోకుల్ జాదవ్ అనే వ్యక్తి నివాసిస్తున్నాడు. అతడికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లవాడు కావాలని జాదవ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. అయితే మూడో సారి అతడి భార్య గర్భం దాల్చింది. ఈసారి కచ్ఛితంగా మగ బిడ్డ పుడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జాదవ్. తన వంశాన్ని నిలబెట్టే మగబిడ్డ పుడతాడని గంపెడు ఆశతో ఎదురు చూసిన అతనికి చివరికి ఆడబిడ్డ పుట్టింది. మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో అతని కోపం కట్టలు తెచ్చుకుంది. కన్న మమకారాన్ని మరచి కసాయిలా ప్రవర్తించాడు. 8 రోజుల పాప నోట్లో పొగాకు కుక్కి ఊపిరిరాడకుండా చేసి చంపేశాడు. పాప జననాన్ని నమోదు చేయడానికి ఆశ వర్కర్ వారి ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు విచారణ చేపట్టి జాదవ్ ను అరెస్ట్ చేశారు. చిన్నారిని పాతిపెట్టిన స్థలం నుంచి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. ఆడ పిల్ల పుట్టినందకే చంపానని అతడు ఒప్పుకున్నాడు.