Flying Bike : ఇప్పటివరకు గాల్లో తేలే విమానాలు, హెలికాప్లర్లు, కార్ల గురించే విన్నారు. త్వరలోనే గాల్లో తేలే బైకుల గురించి వింటారు.. కాదు కాదు చూస్తారు.. డబ్బులు దండిగా ఉన్నోళ్లయితే కొంటారు కూడా. రోడ్లపై ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు జర్నీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ బైకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతానికి మార్కెట్లోకి రాలేదు కానీ.. త్వరలోనే రానున్నాయి. ఇప్పటికే వాటిని డిజైన్ చేసిన కంపెనీకి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ గాల్లో ఎగిరే బైక్‌కి ‘స్పీడర్’ అని పేరు పెట్టారు. ఈ మోటార్ సైకిల్ గంటకు 96 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు ఎగురుతుంది. దీని ప్రారంభ ధర రూ.3.15 కోట్లుగా నిర్ణయించబడింది. 136 కిలోల బరువున్న ఈ బైక్ 272 కిలోల బరువును మోయగలదు. ఈ బైక్‌ను రిమోట్ ద్వారా కూడా నియంత్రించవచ్చు.
ఈ ఫ్లయింగ్ బైక్‌ను అమెరికాకు చెందిన జెట్‌ప్యాక్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసింది. మొదటి డిజైన్‌లో నాలుగు టర్బైన్‌లు ఉన్నాయి. అయితే, తుది ఉత్పత్తిలో 8 టర్బైన్‌లు ఉంటాయి. ఈ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన విమాన పరీక్షలను జెట్‌ప్యాక్ ఏవియేషన్ నిర్వహించింది. ఇది యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ పొందుతుందని భావిస్తున్నారు. 2-3 ఏళ్లలో కంపెనీకి చెందిన ఎనిమిది జెట్ ఇంజన్ స్పీడర్ ఫ్లయింగ్ బైక్‌లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ ఫ్లయింగ్ బైక్ ఒక ఎయిర్ యుటిలిటీ వాహనం. అంటే మెడికల్ ఎమర్జెన్సీ, అగ్నిప్రమాదాల సందర్భాల్లో దీనిని వాడితే మంచి ఫలితాలు వస్తాయి. సైనిక మార్కెట్ కోసం కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌గా మానవరహిత వెర్షన్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇది భూమి నుండి 100 అడుగుల ఎత్తులో 400 MPH వేగంతో ఎగురుతుంది. గతేడాది జపనీస్ స్టార్టప్ కంపెనీ AERWINS టెక్నాలజీ అమెరికాలో జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో ‘XTurismo’ ఫ్లయింగ్ బైక్‌ను ప్రదర్శించింది.