హిందీ ‘జెర్సీ’ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ మూవీకి ఒమిక్రాన్ కేసుల సెగ తగలడంతో ఈనెల 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు నిర్మాతలు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన తెలుగు మూవీ ‘జెర్సీ’ని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. తెలుగు మూవీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ మూవీని కూడా తెరకెక్కించాడు.
Read Also: తనతో తానే పోటీ పడుతున్న నాగశౌర్య
దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ‘జెర్సీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఆమీర్ ఖాన్‌తో హిందీలో ‘గజిని’ మూవీని రూపొందించిన తర్వాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా ఇదే. సినిమా మీద మంచి హైప్ క్రియేట్ కావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు టాక్. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కలెక్షన్‌ల మీద ప్రభావం పడే అవకాశముందని భావించి మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గతంలో కూడా కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.