సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేకువజామున పాఠశాల ఆవరణలో మేకపిల్లను బలి ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పూజల కోసం ఉదయం ఐదు గంటల సమయంలో పాఠశాల గేటు తెరిచి ఉంచిన రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం, బలిపూజ కోసం ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయం బయటపడిన వెంటనే వెంకటేశం అక్కడి నుంచి పరారయ్యాడు.
READ MORE: AP Secretariat: ఏపీ సచివాలయంలోని పవన్ కళ్యాణ్ ఛాంబర్ వద్ద అగ్నిప్రమాదం?
బలిపూజపై మీడియా సంస్థ ఎన్టీవీ ప్రశ్నించగా, పాఠశాల వాస్తు సరిగాలేదని, అందుకే ఇలా చేస్తున్నామని చెబుతూ ముఖం చాటేసిన వెంకటేశం, మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు జిల్లా విద్యాధికారికి సమాచారం అందించగా, ఆయన ఆదేశాలతో మండల విద్యాధికారి (MEO) రఘుపతి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. పాఠశాల ప్రారంభమైన తరువాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Siddu Jonnalagadda: జాక్.. చేస్తాడు మనసుల్ని హ్యాక్ : సిద్ధూ జొన్నలగడ్డ
ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి మూఢనమ్మకాల పూజలు, బలిచేపట్టే యత్నాలు జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థలైన పాఠశాలల్లో ఆచరణీయమైన నైతిక విలువలకు బదులుగా మూఢనమ్మకాలు ప్రోత్సహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.