పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు… వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. కవితను అరెస్ట్ చేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మైలేజీ వస్తుందని బహిరంగంగా కామెంట్ చేశారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కవితను అరెస్ట్ చేయడం అప్పట్లో కుదరలేదు. దీంతో శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో కవితను అరెస్ట్ చేయడంపై బీజేపీ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో రాజకీయంగా లబ్దిపొందేందుకే కవితను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ ను బీజేపీ ఖాతాలో పడితే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందనే భయంతోనే కిషన్ రెడ్డి తమ పార్టీ నేతలతో ఈ విషయంపై స్పందించొద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బీజేపీ నేతలు కవిత అరెస్ట్ పై సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల బాణాసంచా కాల్చారు. తప్పు చేసిన వారికి ఎవరికైనా శిక్ష తప్పదని బీజేపీ నేతలు తెలిపారు.
BJP: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీజేపీ నేతల రియాక్షన్ ఇదే..!