ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని… ఈ రోజు సోదరి వెళ్లింది… రేపు సోదరుడు వెళ్ళవచ్చు… ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
కవిత ఎప్పటికైనా అరెస్ట్ కావాల్సిందేనని.. ఎందుకంటే ఇది మోడీ పాలన… మోడీ పాలనలో అవినీతిపరులను వదిలేది లేదన్నారు. ఇంతకుముందు ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని, ఆ తర్వాత కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కానీ ఆమె విచారణకు వెళ్లలేదని.. పైగా సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ రోజు కాకున్నా రేపైనా ఆమె అరెస్ట్ కావాల్సిందేనని… ఈ రోజు అరెస్ట్ అయ్యారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అన్యాయంగా తనపై పీడీ యాక్ట్ పెట్టి 77 రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ రాజ్యంలో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని తెలిపారు.
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్
మరోవైపు.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. కవిత అరెస్ట్ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన కేటీఆర్, హరీష్ రావు ఇంకా మారలేదని విమర్శించారు. బీజేపీ పై అనవసర ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని తెలిపారు. కవితను లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేస్తే.. బీజేపీకి ఏం సంబంధం అన్నారాయన. తమది రాజకీయ పార్టీ, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం దేశాన్ని ముందుకు నడిపించడం తమ పని అని అన్నారు. కేటీఆర్ బుద్ది మంతుడైతే.. చెల్లెల్ని లిక్కర్ స్కాం చేయకుండా ఆపేది ఉండేనని తెలిపారు.