తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను మళ్ళీ చూస్తారన్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఈ రోజు ఖరారు అవుతుందని తెలిపారు. రానున్న రోజులు మనవే.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభం అయ్యింది.. మరో ఐయిదేళ్లలో మనమే గెలుస్తున్నాం.. పార్లమెంట్ లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది.. మన పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు.. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు.. 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
Read Also: Singapore: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సర్కార్ కీలక ఆదేశాలు
ఇక, తామకు అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు అని కేసీఆర్ అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రానా సార్ అని నన్ను సంప్రదించాడు.. ఇప్పుడే వద్దని నేను వారించానని తెలిపినట్లు చెప్పారు ఆయన. అలాగే, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవిత ను అరెస్ట్ చేశారు అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఎలాంటి తప్పు చేయలేదు.. ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేక పోయారన్నారు. అయితే, ఈనెల 22 నుంచి రోడ్డు షోలు ప్రారంభమౌతాయి.. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం.. ఒక్కో లోక్ సభ నియోజక వర్గం పరధిలోని రెండు మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్డు షోలు చేస్తానన్నారు. రోజుకు రెండు మూడు రోడ్డు షోలుంటాయి.. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్ లు ఉండనున్నాయి. ఉదయం రైతుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.