బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా ఆర్త నాదాలో అల్లారుతోందన్నారు. ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భేటీలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ కూడా ఉన్నారు.
READ MORE: Iran-US: ముసురుతున్న యుద్ధ వాతావరణం.. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఇరాన్
మరోవైపు.. బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్పందించారు. “యూనివర్శిటీ భూముల దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం రేవంత్ రెడ్డికి చెల్లుతుంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను మించిపోయారు. భవిష్యత్ లో తెలంగాణను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోయేలా ఉన్నారు. ఇది ప్రజా పాలననా..? నియతృత్వ పాలననా..? మూసీ, ఫార్మా, భూములు తాకట్టు పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. సెంట్రల్ యూనివర్శిటీ భూములపై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. యూనివర్శిటీ భూములను అమ్ముకునే ఖర్మ ఎందుకు వచ్చింది. తక్షణమే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.” అని బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.