Dharmapuri Arvind: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిపై లిక్కర్ మాఫియా, డ్రగ్స్, బాలీవుడ్ వాళ్లతో సంబంధాలు ఉన్నట్లు ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇళ్లు నిర్మితమయ్యాయన్న అర్వింద్.. తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. హౌసింగ్ శాఖలో 1821మందికి 5 వందల మంది సిబ్బందే ఉన్నారని ఆయన అన్నారు. హౌసింగ్ శాఖ బంద్ అయితే పని ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు.
రూ.18వేల 5వందల కోట్లలో నయా పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇళ్లు కడుతున్నట్లు బడ్జెట్ కేటాయించారని.. 9 ఏళ్ల నుంచి ఇవ్వనిది ఈ మూడు నెలల్లో కేటీఆర్ ఇస్తాడా అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
Also Read: Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పనుల పరిశీలనకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అనుమతి తీసుకున్నాక కూడా బాటసింగారంకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. బీజేపీ నాయకులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అప్రజస్వామికంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారన్నారు. “డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ మోసాలను ఇక ప్రజలు నమ్మరు. అరెస్టులు, అడ్డంకులతో బీజేపీ ఎదుగుదలను ఆపలేరు. మా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం.” అని నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.