తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజసంగ్రామ పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. అయితే.. రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్‌లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్‌లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే.. దీనిపై బీజేపీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ 30సిటీ పోలీసు యాక్ట్ పెట్టడం చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రేపు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జేపీ. నడ్డా సభ నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఏ కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తోందని, తెలంగాణలో ఎవరూ మంటలు పెడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కుమార్తెను ఓడించాడని ఎంపీ అర్వింద్ ను నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛ పోయింది… గూండాయిజం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో టీఆర్ఎస్ మంటలు పెడుతుందని, బీజేపీలో చేరితే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర జరిగిన ఒక చిన్న సంఘటన జరగలేదని, జనగామ జిల్లాలో ఓ మంత్రి కావాలని పాదయాత్రపై దాడి చేయించారన్నారు. పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక పోతున్నారని, అమిత్ షా, జేపీ నడ్డా వస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆర్ట్స్ కళాశాలకు ఐదు లక్షలు కట్టిన తర్వాత బహిరంగ సభకు అనుమతి లేదంటున్నారని, చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన వరంగల్ కమిషనర్ 30వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు అంటున్నారన్నారు. ట్విట్టర్ టిల్లు జేపీ నడ్డా ఎవరని ప్రశ్నించారు… వొంగొంగి దండాలు పెట్టలేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులను, అధికారులను ఉపయోగించుకుంటున్న కేసీఆర్.. బీజేపీపై ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారన్నారు.