బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఆదివారంతో ముగిసింది. ఎవరూ ఊహించని విధంగా సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే, టైటిల్ కల్యాణ్ గెలిచినప్పటికీ, సంపాదన విషయంలో మాత్రం తనూజ అందరినీ ఆశ్చర్యపరిచింది. తనూజకు వారానికి రూ. 2.50 లక్షల చొప్పున 15 వారాలకు గానూ ఏకంగా రూ. 37.50 లక్షల పారితోషికం అందింది. ఇది విన్నర్ కల్యాణ్ అందుకున్న రూ. 35 లక్షల ప్రైజ్ మనీ కంటే ఎక్కువగా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కల్యాణ్ పడాల విషయానికొస్తే.. ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల నగదు, ఖరీదైన మారుతి సుజుకి కారు, అదనంగా మరో రూ. 5 లక్షల గిఫ్ట్ వోచర్ సొంతం చేసుకున్నాడు. ఆయనకు వారానికి రూ. 70 వేల చొప్పున రెమ్యునరేషన్ అందగా, అన్నీ కలిపి సుమారు రూ. 60 నుంచి 70 లక్షల వరకు వెనకేశాడు. తనూజ మొదటి మహిళా విజేతగా నిలిచి రికార్డు సృష్టిస్తుందని ఆశించిన అభిమానులకు ఆమె ఓటమి నిరాశ కలిగించినప్పటికీ, భారీ పారితోషికం అందుకోవడంతో ఆమె ఫాలోవర్లు ఖుషీ అవుతున్నారు. మొత్తానికి ఈ సీజన్ ‘జై జవాన్’ అంటూ కల్యాణ్ విజయంతో ఘనంగా ముగిసింది.