NTV Telugu Site icon

IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ చావో రేవో.. మనోళ్లు నెగ్గుతారా?

Ind Vs Ban

Ind Vs Ban

IND vs BAN: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్‌ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది. ఈ కీలక మ్యాచ్‌ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్‌ సిరీస్‌ను చేజార్చుకోనుంది. ఈ కీలక పోరులో సత్తా చాటాలని రోహిత్ సేన కోరుకుంటోంది.

భారత్‌ను ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించింది. కానీ గెలుపు ముంగిట బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్‌ తీయలేక భారత్ పరాజయాన్ని చవిచూసింది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్‌ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది. చివరిగా ధోనీ సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే భారత్ నెగ్గింది. ఆ చరిత్ర పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.

Miss India 2023: మిస్ ఇండియా కావాలని భావిస్తున్నారా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా..!!

ఈ కీలక మ్యాచ్‌లోనైనా రోహిత్, కోహ్లీ, శిఖర్ ధావన్‌లు చెలరేగాలని భారత్ ఆశిస్తోంది. టీమిండియా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయడం చాలా అవసరం. తొలి వన్డేలో 25 ఓవర్ల కంటే ఎక్కువ విలువైన డాట్‌ బాల్స్‌ ఆడారు. మరోవైపు బంగ్లాదేశ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్‌లో బలంగా ఉన్న బంగ్లా జట్టుకు.. బ్యాటింగ్‌లో సమస్యలు ఉన్నాయి. దానిని భారత్ ఉపయోగించుకుంటే విజయం సులభమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.