దేశ రాజధాని ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ అమానవీయ ఉదంతంపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో నేరస్థులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని, పసి ప్రాణాలకు రక్షణ కల్పించడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నామని ఆమె ఆవేదన చెందారు. కేవలం 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలురు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం మన విద్యా వ్యవస్థ, పెంపకంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
Also Read : Champion: సడెన్‌గా OTT ఎంట్రీ ఇచ్చిన.. యంగ్ హీరో మూవీ
ముఖ్యంగా దేశంలో వీధి కుక్కల సమస్యపై గంటల తరబడి చర్చలు జరుపుతామని, కానీ అంతకంటే క్రూరంగా ప్రవర్తించే మనుషుల గురించి ఎందుకు మాట్లాడరని భూమి నిలదీశారు. ‘మూగజీవాలను శిక్షించడానికి చూపించే ఆసక్తి, ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో ఎందుకు కనిపించదు?’ అని ఆమె ప్రశ్నించారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో జరిగిన ఈ ఘటనలో చిన్నారిని నిర్బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి హింసించడం అత్యంత దారుణమని ఆమె విమర్శించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నారు. మహిళా భద్రతపై భూమి చేసిన ఈ ఘాటైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.