Pawan Singh: బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్‌పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్‌ని బెంగాల్ అసన్‌సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్‌గా పలు విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే, తాను పోటీ చేయలేనని ఈ రోజు పవన్ సింగ్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా.. ‘‘భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ నన్ను నమ్మి అసన్‌సోల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది, కానీ కొన్ని కారణాల వల్ల నేను అసన్‌సోల్ నుండి ఎన్నికల్లో పోటీ చేయలేను’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also: MP Bharath: గుంటనక్కలు కాసుకుని కూర్చున్నారు.. ప్రజలు గమనించి ఓటేయాలి!
ఈ పరిణామంపై టీఎంసీ నేతలు బీజేపీ టార్గెట్‌గా విమర్శలు ప్రారంభించారు. ‘‘పశ్చిమ బెంగాల్ ప్రజల శక్తి’’ అంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్, తృణమూల్ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. పవన్ సింగ్ ‘‘ తన సెక్సిస్ట్ మిసోజినిస్ట్ వీడియోల’’పై ఎదరుదెబ్బ తగలడంతోనే వెనక్కి తగ్గారని అన్నారు. ఇది టీఎంసీ ప్రభావం అని, బెంగాల్ఋలో బీజేపీ ‘నారీ శక్తి’ పిలుపు ఇప్పుడు చితికిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు.
38 ఏళ్ల భోజ్‌పురి గాయకుడు, బెంగాలీ మహిళలను అవమానించేలా పాటలు తీస్తున్నాడని పలువురు హైలెట్ చేయడంతో అతను వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అసన్‌సోల్ నుంచి ప్రస్తుత టీఎంసీ తరుపున ఎంపీగా బాలీవుడ్ లెజెండ్ శత్రుగన్ సిన్హా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలుగా ఉన్న గౌతమ్ గంభీర్, జయంత్ సిన్హాలు తాము పోటీ చేయమని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటామని వెల్లడించారు.