Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలపై మాట్లాడారు. ఆయన రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ.. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే.. రైతు భరోసాలో 12 వేలు వేయాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడటంతో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇక, భూమి లేని రైతులకు సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. భూమి లేని రైతుల గురించి ఎప్పుడైనా కేటీఆర్ ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. భూమి లేని రైతులకు 12 వేలు ఇస్తున్నాం. ఆర్థిక వెసులుబాటు తగ్గడంతో సహా నిర్ణయాలు తీసుకున్నాం అని తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్‌పై మరింత విమర్శలు చేస్తూ.. ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్‌లకు కూడా కేటీఆర్ రైతు భరోసా ఇవ్వాలని అంటున్నాడని తెలిపారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వమని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బీజేపీపై కూడా మండిపడ్డారు. బీజేపీ వాళ్లు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్లకు అంత మంచిది. బీజేపీ ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు ఏంటో ఒకసారి చూసుకోండి. మీరు పెట్టిన నిబంధనలు మేము పెట్టకుండా రైతుకు అండగా ఉంటున్నాం. మేము ఏ నిబంధన పెట్టకుండా రైతు సాగుకు సాయం చేస్తున్నామని అన్నారు.