సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నేడు 81వ రోజు అచ్చంపేట నియోజకవర్గం బొమ్మనపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓడిపోతానన్న భయం పట్టుకొని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముక్తా కాంగ్రెస్ అని మాట్లాడిన ప్రధాని మోడీ కర్ణాటకలో బోర్ల పడ్డారని, దేశ ప్రధానిగా కాకుండా బిజెపి రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసినటువంటి మోడీకి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పి పారద్రోలారన్నారు.
అంతేకాకుండా..’అధికారం ఉందని విర్రవీగుతున్న కేసీఆర్ కు 2023 -24 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఉతికి బంగాళాఖాతంలో పడేస్తారు. పోలీసులు లేకుండా ప్రజలతో మమేకమై ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలను వినే బిఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలుపుతారని అంటున్నాను. పాము పడగ నిడలో భయం భయంగా బతికిన తెలంగాణ సమాజం ఇక ఆలా బతకలేమని పిడికిలి బిగించి తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. నేను పోలీసులు లేకుండా ప్రజల మధ్య తిరిగినట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసులు లేకుండా, ముందస్తు అరెస్టులు లేకుండా రేపు జరగబోయే నాగర్కర్నూల్ సభకు వచ్చి వెళితే అర్థమవుతుంది. అప్పుడు ఎవరిని ఎవరు బంగాళాఖాతంలో వేస్తారో కెసిఆర్ కు తెలుస్తుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని కెసిఆర్ చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ కరెంటు ఇస్తున్న విషయాన్ని మర్చిపోతుండు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో ఒక్క కరెంటు పరిశ్రమను ప్రారంభం చేసిందా?. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇంకా ప్రొడక్షనే ప్రారంభం కాలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ట్రయల్ రన్ లో నడుస్తున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఉత్పత్తి చేసే పరిశ్రమల నుంచి కూడా కరెంటు ఇవ్వాలని సోనియా గాంధీ దగ్గరుండి చట్టంలో రాయించడం వల్లనే తెలంగాణలో కరెంటు కోతలు లేవు. కాంగ్రెస్ వస్తే దళిత బంధు రాదని చెప్పడం కెసిఆర్ దిగజారుడు మాటలకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు దళిత బంధుఃమకు కేటాయించి ఏడాది పూర్తయిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా చట్టసభను అవమానపరిచింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది బిఆర్ఎస్ కాదా? రైతుబంధు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సరికాదు. సబ్సిడీ విత్తనాలు, పాలిహౌస్, స్పీకర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే సబ్సిడీ కోత పెట్టి రైతులను దగా చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం. రుణమాఫీ అమలు చేస్తానని చేయకపోవడంతో రైతుల ఖాతాలు బ్యాంకుల్లో ఇర్రేగ్యులర్ అకౌంట్స్ గా మారి రుణాలు పొందని దుస్థితిలో ఉన్నారు. పంట రుణాలు తీసుకునే ముందు రైతులు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. పండిన పంటను కూడా కొనుగోలు చేయలేని అసమర్ధ ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యంలో క్వింటాకు 14 కిలోల తరుగు తీసివేస్తూ రైతులను నిలువుగా మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ పాలనలో ఏ రైతు బాగుపడ్డారు? ఆనందంగా ఉన్నారు? మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తానని చేయకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్స్ ను బలవంతంగా గుంజుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి పేదలకు పంచిన అసైన్డ్ భూములను గుంజుకొని బలవంతంగా నిర్మాణం చేశారు. దళిత, గిరిజనుల జీవితాల భవిష్యత్తును కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల పునాదుల్లో సమాధి చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందే. హరితహారం, రైతు వేదిక, బహుళ జాతి కంపెనీలకు పేదల భూములు గుంజుకొని ఇస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం. పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం సాధించి పెట్టారని? ఇక నీ పాలనను ఉపేక్షించాలి? 30 నెలల్లో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఏడేళ్లు కాలయాపన చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని నాగర్ కర్నూల్ సభకు ఓట్లు అడగడానికి వస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పిల్ల కాలువలను 10 సంవత్సరాలుగా తీయని అసమర్ధ ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కొలువులు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ను ఇక నీ పాలన చాలని నిరుద్యోగ విద్యార్థులు గొంతేత్తుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సినిమా అయిపోయింది, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ శ్రేణులు ఉతికి ఆరేసే రోజులు వచ్చాయి. నాలుగు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజల ముందు పెడతాం.’ అని ఆయన అన్నారు.