Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు.. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు .. అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను ఈ అంకెలు తెలియజేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్ల రూపాయల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. రైతు వేదికలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది, రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. 110 రైతు వేదికల్లో నాలుగు కోట్ల పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయాన్ని వివరించారు. 1,57,51000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదో అని భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతులకు పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది అన్నారు. 2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తుందని తెలిపారు. గత వాన కాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో దాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Itel A50: అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం రూ. 6099కే