తెలంగాణలో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి.. నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే.. కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రంకి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. కేటీఆర్ ఆయనకు ఉన్న కల్చర్ అందరికి ఉంటాయనుకుంటాడని ఆయన విమర్శలు గుప్పించారు. పబ్బుల కల్చర్ నిది కేటీఆర్ అని, 20 సార్లు కాదు కేటీఆర్ 230 సార్లు పోతాడున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి పక్ష హోదా ఇస్తే.. మీ నాయన కడుపుల సల్ల కదలకుండా ఫామ్ హౌస్ లో పండుకుండు అని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. ప్రతి పక్ష హోదాలో ప్రజల పక్షాన ఉండాల్సిన మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని, గజ్వేల్ లో కేసీఆర్ మిస్సింగ్ అని పోస్టర్లు వెలిశాయని ఆయన అన్నారు.
మెట్రో రెండో దశ, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం ఢిల్లీ వెళ్తే.. ఢిల్లీ కి ముడుపుల కోసం వెళ్లిండు అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం పన్ను కడతాలేమా.. .మనకు వాటా లేదా… అడిగే అర్హత లేదా.. రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ వెళ్తున్నారని ఆయన అన్నారు. మీ హయాంలో ఒక్కనాడు రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళలేదని, మీ చెల్లెలు కదా 100 కోట్ల ముడుపులు కట్టింది లిక్కర్ స్కాం లో అని ఆయన అన్నారు. నల్గొండ,రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలలు మూసి తో ఇబ్బందులు పడుతున్నారని, మూసీ పరివాహక ప్రజలకి నష్టం లేకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పి ఇంటికి పంపిన ఇంకా మారలేదని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బుద్ది చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుండి కస్టపడి వచ్చి సీఎం అయ్యిండని, అమెరికా నుండి వచ్చి తండ్రి చాటు కొడుకువి మంత్రివి అయ్యావని ఆయన అన్నారు. కేటీఆర్ ఖబర్దార్…. ఇప్పటికైనా విమర్శలు మానుకోక పోతే నాలుక కోస్తాం.. సిగ్గు మాలిన మాటలు మానుకోండి అంటూ బీర్ల ఐలయ్య ధ్వజమెత్తారు.