Gautam Gambhir: టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు గంభీర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత గౌతమ్ గంభీర్‌తో తదుపరి చర్చలు జరుగుతాయని క్రీడా వర్గాలు అంటున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రధాన కోచ్ పదవిలో తన పదవీకాలాన్ని పొడిగించకూడదని ప్రస్తుత కోచ్ ద్రవిడ్ ఇప్పటికే బీసీసీఐకి తెలిపాడు.
Read Also: MI vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన గంభీర్‌కు మంచి క్రికెటింగ్ బుర్ర ఉందని, వ్యూహ రచనలో దిట్ట అని పేరు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. దీంతో బీసీసీఐ గంభీర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు లక్నోను నడిపించిన అనుభవం ఉంది. అయితే బీసీసీఐ పెద్దలు అడగకున్నా సొంతంగా హెడ్ కోచ్ పదవి కోసం గౌతీ దరఖాస్తు చేసుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరం. రోహిత్ శర్మతో అతడికి సత్సంబంధాలు ఉన్నా.. కింగ్ విరాట్ కోహ్లీతో విభేదాలు ప్రతిబంధకమే అని చెప్పాలి.