టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్‌ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లను గత నెలలో వారి పదవుల నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. దిలీప్‌ను తిరిగి ఇంగ్లండ్ పర్యటనకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ఓ సంవత్సర కాలం పాటు అతడు జట్టుతో ఉండనున్నాడు.
ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం టి దిలీప్‌ను మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడిని నియమించాలని బీసీసీఐ ప్రయత్నించనా.. అది కుదరలేదు. దాంతో భారత జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి ఎంపిక చేసింది. ‘దిలీప్ మంచి కోచ్. అతను మూడు సంవత్సరాలకు పైగా (2021 నుండి) జట్టుకు సేవలు అందించాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అతన్ని జట్టులో చేర్చుకోవడం మంచిది విషయం’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిజానికి జట్టులో దిలీప్ హయాంలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలను బాగా మెరుగయ్యాయి.
టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ ఎంపికయిన విషయం తెలిసిందే. జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్‌కు గుజరాత్ అర్హత సాధిస్తే.. జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పయనమయ్యే అవకాశం ఉంది.