MLC Kavitha : తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల హక్కులు, రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏమి చేస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు.
బీసీ బిల్లులను ఆమోదింపజేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తగిన ఒత్తిడి తేవాలని కవిత కోరారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52%గా తేలిందని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కులసర్వేలో బీసీల జనాభా తగ్గించి, ఓసీల జనాభా పెంచినట్లు ఆమె ఆరోపించారు. ప్రభుత్వం గ్రామాల వారీగా, కులాల వారీగా జనాభా లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదని కవిత విమర్శించారు. బీసీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్ పోరాటం వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ చట్టాలు చేశామని ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 54%కి పెరిగాయని కవిత చెప్పారు. 50% పరిమితిని మించి ఉన్నందున కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయించేందుకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీ రౌండ్ టేబుల్ సమావేశం చివరికి బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిసింది.
March Tollywood Review: మార్చ్ నెలలో వచ్చి హిట్, ఫట్ అయిన సినిమాలివే!