ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిన ఘనత జగన్ రెడ్డికే దక్కించదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్స్ దాటితే కరెంటు బిల్లులు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.
YS Sharmila: నేను ఎవరు వదిలిన బాణం కాదు.. సజ్జలకు షర్మిల కౌంటర్
ఎన్నికలకు ముందు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇస్తానని, ఇప్పుడు అందులో రూ. 2 వేలు కొట్టేసి కేవలం రూ. 13 వేలు మాత్రమే ఇస్తున్నాడని బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. అది కూడా ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఇచ్చి, జగన్ రెడ్డి పంగనామాలు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన మహిళలందరికీ ఏటా రూ.18 వేలు ఇస్తానని.. మాట తప్పి, మడమ తిప్పిన జగన్ రెడ్డి కేవలం 10 శాతమే ఇచ్చి దగా చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ రూ. 15 వేలు అందిస్తామని, ఆడబిడ్డ నిధి కింద.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికీ నెలకు రూ. 1500 చొప్పున సంవత్సరానికి 18 వేలు అందిస్తామని చెప్పారు. అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం, రైతులకు సంవత్సరానికి రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు.
Kishan Reddy : సాలార్‌జంగ్ మ్యూజియం 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉంది
మరోసారి ఒక్క ఛాన్స్ అని నమ్మి అధికారం కట్టబెడితే, మన గొంతు కోస్తున్న జగన్ రెడ్డి మాయమాటలను మళ్లీ నమ్మితే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లే అని అన్నారు. మరో 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే బనగానపల్లె నియోజకవర్గంలో ఇల్లు లేని పేద కుటుంబానికి సొంత నిధులతో 2 సెంట్ల స్థలం ఇస్తానని బీసీ జనార్థన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మొత్తంగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డికి దక్కుతున్న ఆదరణతో ఈసారి బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీసీ జనార్థన్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఓటమి తప్పదని బనగానపల్లెలో చర్చ జరుగుతోంది.