Bandi Sanjay Said Congress Dharna for 100 percent Muslim Reservations: ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్ప.. బీసీల కోసం కానేకాదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలనుకుంటోందని, బీసీలను ఘోరంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం అని బండి సంజయ్ చెప్పారు.
‘ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు.. ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే. బీసీలకు 5 శాతం పెంచి.. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే కుట్ర ఇది. బీసీ ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసే కుట్ర. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీని ప్రధాని చేశారా?. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా?. రాష్ట్ర కేబినెట్‌లో, నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చిద్దామా?. లోక్ సభ సభ్యుల్లో ఎంతమంది బీసీలకు సీట్లిచ్చారో సమాధానమివ్వగలరా?. మీరా బీసీల గురించి మాకు నీతులు చెప్పేది?. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే. 27 మంది బీసీ కేంద్ర మంత్రులను, అనేక రాష్ట్రాలకు బీసీ సీఎంలను నియమించిన ఘనత బీజేపీదే. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగవడం తథ్యం’ అని బండి సంజయ్ అన్నారు.
Also Read: Raksha Bandhan 2025: ఆగస్టు 9న రక్షా బంధన్.. రాఖీ కట్టడానికి శుభ సమయం ఇదే!
‘పక్కా ప్లాన్ ప్రకారమే తెలంగాణలో మెజారిటీ హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర చేస్తోంది. ఎందుకంటే ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలు చేసి.. హిందువులను మైనారిటీలుగా చేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోంది. ఈ విషయంలో మా లైన్ క్లియర్ గా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మత రిజర్వేషన్లకు విరుద్ధం. మొదటి నుండి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఇకనైనా బీసీలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తాం. లేనిపక్షంలో తప్పనిసరిగా ఈ బిల్లును అడ్డుకుని తీరుతాం. ఇట్లాంటి విష వ్రుక్షాన్ని తెలంగాణలో అడ్డుకోకపోతే ఈ విష వ్రుక్షం దేశమంతా విస్తరించే ప్రమాదముంది. తక్షణమే ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పి తీరుతాం. బీసీ సామాజిక వర్గంతో పాటు యావత్ హిందూ సమాజమంతా కాంగ్రెస్ పై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
‘బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందే తప్ప చిత్తశుద్ధి లేనేలేదు. ఈ దేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా బలహీనవర్గాల వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిందా?. ఎమర్జెన్సీ అనంతరం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ఛీత్కరిస్తే తెలంగాణలోని దళిత, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మెదక్ నుండి ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి ఆమెకు రాజకీయ పునర్జన్మ ప్రసాదిస్తే… గెలిచాక కూడా బీసీలకు ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా ఆ వర్గాల ప్రజలను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దే. 1989లో దేశమంతా కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైతే ఉమ్మడి ఏపీ నుండి కాంగ్రెస్ కు 39 స్థానాలను తెలుగు ప్రజలు అందించారు. అట్లాగే 2004, 2009లోనూ కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో ఎంపీలను అందించిన తెలుగు ప్రజలను వంచించిన చరిత్ర కాంగ్రెస్ దే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.