ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు. మొత్తం బ్యారేజీనే కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికలో పేర్కొన్నదనంటే పనులు ఏ విధంగా జరిగాయో అర్థమవుతోందని అన్నారు. మేడిగడ్డ ఒక్కటి కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టత కూడా ప్రమాదమేనని ఈ కమిటీ నివేదికలో ప్రస్తావించిందని తెలిపారు. అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తమ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి తప్ప రైతుల మేలు కోసం చేయలేదని అర్థమవుతోందని విమర్శించారు.
Read Also: MP Sri Krishna Devarayalu: ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు..
ఇంజనీర్లు చేయాల్సిన పనిలో కేసీఆర్ మితిమీరిన జోక్యం చేసుకోవడంతోనే లక్ష కోట్ల ప్రజల సంపద వృథా అయిందని బండి సంజయ్ అన్నారు. డ్యాం సేఫ్టీ అథారిటీ 20 రకాల వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల వివరాలు మాత్రమే ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ లెక్కన అందులో ఎన్ని అక్రమాలు దాచి పెట్టారో ప్రజలకు అర్థమవుతోందని తెలిపారు. కేసీఆర్ దాచితే నిజాలు దాగవని.. కేసీఆర్ అవినీతి అక్రమాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు స్వరూపాన్ని ప్రకృతే బయటపెట్టిందని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజల నెత్తిన అప్పు భారం మోపి తెచ్చిన లక్ష కోట్ల అప్పు తీర్చడమే భారంగా మారిన తరుణంలో ఈ ప్రాజెక్టు దేనికీ పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడటంతో.. తెలంగాణ ఆర్దిక వ్యవస్థపైనే కాకుండా ప్రజల జీవితాలకు సైతం ప్రభావం చూపే పరిస్థితి నెలకొందని తెలిపారు.
Read Also: Khaleja: హాలీవుడ్ రేంజ్ సినిమాను ప్లాప్ చేశారు కదరా..
బ్యారేజీ నిర్మాణాలను తనిఖీ చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలుమార్లు కేసీఆర్ ప్రభుత్వానికి పదేపదే లేఖలు రాసినా పెడచెవిన పెట్టడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని తప్పిదమని.. కేసీఆర్ ఇంజనీరింగ్ ప్రతిభ, ముందు చూపుకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన సొమ్మునంతా కేసీఆర్ కుటుంబం నుండి ముక్కుపిండి వసూలు చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరడానికి కారకులైన వారందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కమీషన్ల కోసం అంచనాలు పెంచి దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తామని.. తప్పు చేసిన వాళ్లందరి చిట్టా విప్పుతామని బండి సంజయ్ అన్నారు.