Bandi Sanjay : కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓట్లేయలేదనుకుంటున్నారా? ఒక వర్గం ఓట్ల కోసం దేవాలయాలపై, హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇకపై ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందువులంతా ఏకమై ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీకి వచ్చిన బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నవగ్రహాల ధ్వంసంపై ఆరా తీశారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె. సంగప్పతోపాటు స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు… ఏమన్నారంటే…
కాంగ్రెస్ పాలనలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఏడాదిలో వరుసగా ఆలయాలపై దాడులే నిదర్శనం. భాగ్యనగరంలోని సంతోష్ నగర్ రక్షాపురంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… గోషామహల్ నియోజకవర్గంలో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… మాసబ్ ట్యాంక్ వద్ద దుర్గామాత విగ్రహం ఎదుట గోవు మాంసం పడేసి అపవిత్రం చేస్తే చర్యల్లేవ్.. అంబర్ పేట లో మహంకాళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. పంజాగుట్టలో పోచమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. సికింద్రాబాద్ కుమ్మరి వాడలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్… ఇక్కడ శంషాబాద్ హనుమాన్ టెంపుల్ లో నవగ్రహాలను ధ్వంసం చేస్తే చర్యల్లేవ్. ఇగ రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై దాడులు చేస్తే చర్యలు అసలే లేవు…
ఇగ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరుగుతున్న దాడులకు లెక్కేలేదు….శామీర్ పేట తూంకుంట లో వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పట్టించుకోరు. మేడ్చల్ లో రాముల వారి విగ్రహాన్ని కూల్చేస్తే చర్యల్లేవ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవత మూర్తి విగ్రహాలను అధికారులు కూల్చేసి హిందువులపై దాడి చేస్తే పట్టించుకోరు. మెదక్ జిల్లా రాయలపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహాన్ని బావిలో పడేస్తే చర్యల్లేవ్. సిద్దిపేట జిల్లా వర్గల్ లో పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చర్యల్లేవ్.. దుండిగల్ లో అమ్మవారి విగ్రహం, బొల్లారంలోని బొంతపల్లి లో హనుమాన్ విగ్రహం, మక్తల్ పట్టణంలో గణేష్ విగ్రహాలను, వికారాబాద్ జిల్లా కోటిపల్లి లో నవగ్రహాలను, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాలను ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లా దోస్ కల్ లో అమ్మవారి విగ్రహాలను, మహేశ్వరం నియోజకవర్గంలోని గట్టుపల్లిలో హనుమంతుడి ఆలయాన్ని ధ్వంసం చేస్తే అసలే చర్యల్లేవ్.. ఇట్లా చెప్పుకుంటూ కాంగ్రెస్ 10 నెలల పాలనలో వందకుపైగా ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులపై దాడులు చేశారు…
నేనడుగుతున్నా….దేవాలయాలపై దాడులు చేసేటోళ్లను పిచ్చోళ్లని ముద్ర వేసి వదిలేస్తారా? పిచ్చోళ్లకు హిందూ దేవాలయాలపైనే దాడులు చేస్తారా? ఇతర ప్రార్ధనా మందిరాల జోలికి వెళ్లరా? లవ్ జిహాద్, జిహాద్, ఆలయాల ధ్వంసం పేరుతో హిందువులపై దాడులు జరుగుతున్నయ్. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. ఇది మంచి పద్దతి కాదు.. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మీరు చర్యలు తీసుకోరా?… మేం మాట్లాడితే దాడులు చేస్తరా? తమకు తాము రక్షించుకోవడానికి హిందువులంతా రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి పరిస్థితి వచ్చింది. రోడ్డుపైకి ఎక్కి ఆందోళన చేసే స్థాయికి వచ్చారు. కాంగ్రెసోళ్లకు హిందువులు ఓట్లేయలేదా? వాళ్ల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై దాడులు చేస్తున్నా, ఆలయాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోరా?పరిస్థితి ఇట్లనే ఉంటే హిందువులు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వచ్చింది… అది రాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా…
ఇయాళ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు… ఆయన నిండు నూరేళ్లు ఆయురోరాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల జోలికి పోతే కఠినాతికఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా… అదే సమయంలో హిందువులందరికీ విజ్ఝప్తి చేస్తున్నా… ఈ దాడులను ఇంకా భరిద్దామా? తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఆలోచించండి. దేవాలయాలు ధ్వంసమైతే బిచ్చమేస్తాం… చూసుకోండని ప్రభుత్వం భావిస్తోంది. మీరు వేసే బిచ్చంతో ఆలయాలను నడిపే పరిస్థితి హిందువులకు ఉందనుకుంటున్నారా? మీరు ఇట్లనే ఉంటే మేం కూడా ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటాం. ఏం చేయాలో అది చేస్తాం. అంత వరకు పరిస్థితి తీసుకురానీయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రోహింగ్యాలకు షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.’ అని బండి సంజయ్ అన్నారు.