వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
Also Read : Mathew Thomas : వరుస సినిమాలను లైన్లో పెడుతున్న మాధ్యూ థామస్
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ, “బాలకృష్ణ సినిమాకి సంగీతం చేయడం అనేది నాకు టెన్త్ ఎగ్జామ్ లా ఉంటుంది. ప్రతి సినిమాకి ఇంకా గొప్ప సంగీతం అందించాలనే కసితో పనిచేస్తున్నాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతోనే సంగీతం చేస్తున్నాను. బాలకృష్ణ గారు నాకు తండ్రి లాంటి వారు. నన్నెప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. దర్శకుడు బాబీకి సంగీతం మీద మంచి పట్టు ఉంది. ఆయన విజిల్ చేస్తూ పాటను హమ్ చేశారంటే అది హిట్టే. భైరవద్వీపం మా కుటుంబాన్ని ఆదుకున్న సినిమా. డ్రమ్స్ వాయిస్తూ రోజుకి రూ. 30 రూపాయలు తీసుకుంటూ బాలకృష్ణ గారి సినిమాతోనే నా సినీ ప్రయాణం మొదలైంది. అలాంటి నేను ఇప్పుడు ఆయన సినిమాలకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ ఎంతో కష్టపడ్డారు. ప్రతి సన్నివేశాన్ని ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సాయి సౌజన్య గారికి నా స్పెషల్ థాంక్స్. డీఓపీ విజయ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచారు. డీఓపీ విజయ్, ఎడిటర్లు నిరంజన్, రూబెన్ వల్లే ఇంత మంచి సంగీతం అందించడం సాధ్యమైంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ధన్యవాదాలు” అన్నారు.