క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
READ MORE: Pawankalyan : మార్క్ శంకర్ తో నేడు తిరుపతికి పవన్ భార్య అన్నా లెజినోవా..
కాగా.. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఎంతోమంది బలైపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ మహమ్మారి మరింత విజృంభించింది. దీని బారిన ఎవరూ పడకుండా ప్రభుత్వం పర్యవేక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలూ ఈ నేపథ్యంలో అప్రమత్తమవుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఓ కంట కనిపెట్టడం చాలా అవసరం.