శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5, 2020-ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. చెల్లించిన మొత్తం పన్నులో రూ.270 కోట్లు వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి)కింద.. మిగిలిన రూ.130 కోట్లు వివిధ ఇతర పన్నుల కింద చెల్లించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం తర్వాత అయోధ్యను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఈ ఆర్థిక పెరుగుదలకు కారణమని రాయ్ పేర్కొన్నారు.
Read Also: Ugadi 2025: రాబోయే ‘విశ్వావసు నామ’ సంవత్సరంలో మీ ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయంటే!
అయోధ్య రామాలయం ప్రధాన మత పర్యాటక కేంద్రంగా అవతరించిందని.. భక్తులు, సందర్శకుల సంఖ్య 10 రెట్లు పెరిగిందని చంపత్ రాయ్ తెలిపారు. భక్తులు, పర్యాటకుల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. మహా కుంభమేళా సందర్భంగా సుమారు 1.26 కోట్ల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారని ఆయన చెప్పారు. గత ఏడాదిలో అయోధ్యకు 16 కోట్ల మంది వచ్చారని.. ప్రత్యేకంగా 5 కోట్ల మంది భక్తులు రామాలయాన్ని సందర్శించారని రాయ్ వెల్లడించారు. రామమందిర ట్రస్ట్ యొక్క ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయని.. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారని రాయ్ తెలిపారు.
Read Also: Chiru-Anil: మెగాస్టార్ సినిమాలోనూ బుల్లి రాజు?
రామాలయ ప్రతిష్ట దేశ మత, సాంస్కృతిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గర్భగుడి, ఆలయం యొక్క మొదటి అంతస్తు జనవరి 2024లో పూర్తయ్యాయి. 2024 జనవరి 22న బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.