యావత్ భారత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆలయ కమిటీ టార్గెట్ నిర్దేశించింది. 2024 జనవరి నుంచి భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఆలయ నిర్మాణ పనులు అనుకున్న ప్రకారం సాగుతున్నాయన్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 2023 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.

ఇటీవల హోంమంత్రి అమిత్ షా రామమందిరాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆలయ నిర్మాణం ఎంతో ఉన్నతంగా, ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మిస్తున్నారు. పనులు అనుకున్న ప్రకారం ముందుకు సాగుతున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. 2023 డిసెంబర్ నాటికి ఆలయ పనులు పూర్తయితే.. 2024 జనవరి నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరవాలని భావిస్తున్నారు.
Read Also:CM KCR: రైతులకు వ్యవసాయం పండుగైన నాడే.. దేశానికి సంపూర్ణ సంక్రాంతి
2024 జనవరి 1 కల్లా అయోధ్యలో రామమందిరం భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. అయోధ్యలో నూతన రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి.
2.77 ఎకరాల విస్తీర్ణం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు కాగా మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. ఇదిలా ఉంటే… రామమందిర నిర్మాణం వేగవంతం చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని అంటున్నారు. ఈ ఏడాది జరగనున్న అనేక రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో, 2024 లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ రామమందిరం నినాదాన్ని క్యాష్ చేసుకుంటుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Read Also: Santokh Singh: భారత్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో మృతి