Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ, వెస్ర్టన్ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఏజెంట్లకు సూచనలు జారీ చేశాయి. ఇదే అంశంపై వ్యక్తిగతంగానే కాకుండా మెయిల్స్ ద్వారా కూడా సమాచారాన్ని పంపించినట్టు ఫెడరేషన్ యూనివర్సిటీ స్పష్టం చేసింది.
Read Also: Astrology : మే 27, శనివారం దినఫలాలు
ఇండియాలోని ఆ 6 రాష్ర్టాల విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు వాస్తవమైనవి కావని, మోసపూరితంగా ఉన్నట్టు ఆష్ర్టేలియా హోం శాఖ వెల్లడించడం వల్లే వీసాల మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుల్లో 25 శాతం మోసపూరితంగానే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు 2 నెలల పాటు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. వలసలు, విద్య నైపుణ్య మార్పిడులను పెంపొందించుకునేందుకు ఇండియా, ఆష్ర్టేలియా దేశాలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్ కోవన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వోలోంగాంగా, టొరెన్స్ వంటి పేరొందిన విశ్వవిద్యాలయాలన్నీ తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు వాటికి అనుబంధంగా కొందరు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. వారి నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగానే విద్యార్థులకు వీసాలు మంజూరు అవుతాయి. భవిష్యత్తులో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేలా యూనివర్సిటీలు తమ ఏజెంట్లకు సూచనలు జారీ చేసినట్టు ది సిడ్నీ హెరాల్డ్ పేర్కొంది.