Nathan Lyon Picks Best Cricketers in His Career: ఆస్ట్రేలియా తరఫున స్పిన్నర్ నాథన్ లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసి అరుదైన ఫీట్‌ను పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా తరపున అత్యంత విజయవంతమైన ఆఫ్-స్పిన్ బౌలర్‌గా నిలిచాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన లియోన్.. 124 టెస్టుల్లో 505 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా టాప్ బౌలర్ అయిన లియోన్‌ను ముగ్గురు బ్యాటర్లు మాత్రం బాగా ఇబ్బందిపెట్టారట. ఇందులో ఇద్దరు భారత క్రికెటర్లు ఉండడం విశేషం.
పాకిస్థాన్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్‌కు ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ సోషల్ మీడియా హ్యాండిల్ నాథన్ లియాన్‌ను ఇంటర్వ్యూ చేసింది. మీరు ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు ఎవరు అని అడగా.. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ అని చెప్పాడు. ఈ ముగ్గురిని ఔట్ చేయడానికి చాలా శ్రమించానని, వీరు ఓ పట్టాన వికెట్ ఇచ్చే ఆటగాళ్లు కాదని పేర్కొన్నాడు. ‘ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నేను కొంతమంది దిగ్గజాలతో ఆడాను. అయితే నా కెరీర్‌లో ముగ్గురు మాత్రం చాలా కఠిన బ్యాటర్లు ఉన్నారు. వారే సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ. వారితో చాలా అద్భుతమైన మ్యాచ్‌లు ఆడా’ అని లియాన్ చెప్పాడు.
Also Read: David Warner: ఫేర్‌వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. నిరాశపర్చిన డేవిడ్ వార్నర్!
‘సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీలను ఔట్ చేయడానికి చాలా శ్రమించా. ఈ ముగ్గురు ఓ పట్టాన వికెట్ ఇచ్చే వారు కాదు. వారి డిఫెన్స్‌కు పరీక్ష పెడితేనే.. వికెట్ దక్కేది. ఆ ముగ్గురిని ఔట్ చేయడం వెనుకున్న నా సీక్రెట్ ఇదే. టెస్ట్ క్రికెట్ ఆస్వాదిస్తున్నా. 500 వికెట్స్ తీయడం చాలా సంతోషంగా ఉంది’ అని నాథన్ లియాన్ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లియాన్ ఆడుతున్నాడు.