South Korea: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రతి ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ సారి అపశ్రుతి చోటుచేసుకుంది. రాజధాని సియోల్‌లోని ఓ ఇరుకు వీధిలోకి శనివారం ఒక్కసారిగా ప్రజల గుంపు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 151 మంది మృతి చెందారు. ఇరుకు వీధిలోకి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో చాలా మంది ప్రజలు భయపడిపోయారు. దాదాపుగా 50 మందికి గుండెపోటు సంభవించినట్లు సమాచారం. ఇటావాన్ లీజర్ డిస్ట్రిక్ట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. చాలా మంది ప్రజలు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడం చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 81 అత్యవసర కాల్స్ వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఘటనలో మరో 150 మంది గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది గుండెపోటుకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణనష్టం ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. దాదాపు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలో దించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడిఉన్నవారిని స్ట్రెచర్లపైకి చేరుస్తూ కొందరు, అత్యవసర గుండె చికిత్సలు అందిస్తూ మరికొందరు కనిపించారు.
South Korea: హాలోవీన్ ఉత్సవాల్లో తొక్కిసలాట.. 50 మందికి గుండె పోటు..పలువురి మృతి
సియోల్‌లోని హామిల్టర్ హోటల్ సమీపంలో ఇరుకైన సందులో ఒకేసారి గుంపులుగా ప్రజలు రావడంతో ఈ ఘటన జరిగింది. అయితే మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. చాలా మందికి తొక్కిసలాటలో శ్వాస ఆడకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ నిర్వహించారు. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని, భద్రతను సమీక్షించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో వైద్య బృందాలను , పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హాలోవీన్ ఉత్సవాల సందర్భంగా దాదాపుగా లక్ష మంది ప్రలజు ఇటావాన్ వీధుల్లోకి చేరుకున్నారని అక్కడి మీడియా నివేదించింది.
ఇటీవల ఆ దేశంలో కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత జరుగుతున్న పెద్ద పెద్ద ఎత్తున హాలో వీన్ ఉత్సవాలు జరుగుతున్నాయి. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒకేసారి అనేకమంది ప్రయత్నించడమే తొక్కిసలాటకు కారణమని స్థానిక ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. కరోనా ఆంక్షల్ని ఇటీవల సడలించడంతో వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని తెలిపాయి.