Assam: బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య భూమిని విక్రయించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) మంజూరును తాత్కాలికంగా నిలిపివేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మతపరమైన వివాదాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. మూడు నెలలపాటు అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వును రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మార్చి 7న జారీ చేసింది.స్వార్థ ప్రయోజనాలతో నడిచే సంభావ్య సంఘర్షణలను నిరోధించడానికి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ల మంజూరును నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Read Also: Moscow: ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన పుతిన్
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కచ్చితంగా అవసరమయ్యే పరిస్థితుల్లో, శాంతిభద్రతల ఉల్లంఘనకు దారితీయదని భావించినట్లయితే జిల్లా కమిషనర్, ఇన్‌స్పెక్టర్ ముందస్తు సమ్మతితో జారీ చేయవచ్చని నోటిఫికేషన్ ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జ్ఞానేంద్ర దేవ్ త్రిపాఠి, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 21A ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. అస్సాంలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.