మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాన్సర్ట్ హాల్‌లో జరిగిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఆయన అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. మృతులకు సంతాపంగా ఆదివారం దేశమంతా జాతీయ సంతాప దినంగా పాటించాల్సిందిగా ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడిలో పాల్గొన్న వారందరికీ శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్టామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక పుతిన్ తన ప్రసంగంలో ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా పనిచేసిన అంబులెన్స్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముష్కరుల దాడిలో 150 మంది చనిపోయినట్లుగా రష్యా ప్రకటించింది. ఇక ఈ దాడిలో పాల్గొన్న మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో కారు ఛేజ్ చేసి వారిని పట్టుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మాస్కోలోని ఓ షాపింగ్ మాల్, సంగీత కచేరీ వేదిక ఉన్నాయి. రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శనకు శుక్రవారం పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే ముష్కరులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులూ విసిరారు. తూటాల నుంచి తప్పించుకునేందుకుగానూ చాలామంది సీట్ల వెనక దాక్కోగా.. మరికొందరు ప్రవేశద్వారాల వైపు పరుగులు తీశారు. బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో మంటలు చెలరేగి.. కొద్దిసేపటికి హాల్ పైకప్పు కూడా కూలిపోయింది. హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ముష్కరులకు ఉక్రెయిన్‌తో పరిచయాలు ఉన్నాయని, దాడుల అనంతరం ఆ దేశం వైపు వెళ్లేందుకు యత్నించారని ఎఫ్‌ఎస్‌బీ ఆరోపించింది. అయితే.. తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్ ఖండించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ఘటనపై అగ్రరాజ్యం గతంలోనే మాస్కోను హెచ్చరించింది.
🔴 #LIVE: President Vladimir Putin's address following the terrorist attack in Crocus City Hall https://t.co/d7DmNZnhA9
— MFA Russia 🇷🇺 (@mfa_russia) March 23, 2024