Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే పాకిస్థాన్ హోం మంత్రి, ACC (ఆసియా క్రికెట్ కౌన్సిల్), PCB (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది.
READ ALSO: Amazon: 14,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది ఇందుకే.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్..
ఆసియా కప్ సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయడానికి కూడా నిరాకరించాడు. ఆసియా కప్ మూడు మ్యాచ్‌ల సమయంలో భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా కూడా దూరంగా ఉంది. ఆసియా కప్‌లో భారత్ విజయం సాధించి నెల రోజులు గడిచినా, ట్రోఫీని అధికారికంగా తీసుకోవడం కోసం బీసీసీఐ ఇంకా వేచి చూస్తోంది. ACC ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్‌ను తన దగ్గరే ఉంచుకున్నారు.
తాజా అప్‌డేట్ ఏంటంటే..
బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. “అవును, నెల రోజులు గడిచినా ట్రోఫీని మాకు అందజేయకపోవడం పట్ల మేము కొంచెం నిరాశ చెందాము. మేము దాదాపు 10 రోజుల క్రితం ఏసీసీ అధ్యక్షుడికి లేఖ రాశాము, కానీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ఇప్పటికీ ట్రోఫీని తన వద్దే ఉంచుకున్నారు, కానీ అది ఒకటి లేదా రెండు రోజుల్లో బీసీసీఐ ముంబై కార్యాలయానికి చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ట్రోఫీని త్వరగా అందజేయకపోతే నవంబర్ 4న దుబాయ్‌లో ప్రారంభమయ్యే ఐసిసి త్రైమాసిక సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని లేవనెత్తుతుందని సైకియా అన్నారు. “ఈ సమస్యను పరిష్కరించడానికి BCCIలో మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ట్రోఫీ కచ్చితంగా భారతదేశానికి వస్తుందని నేను దేశ ప్రజలకు హామీ ఇవ్వగలను. కానీ సమయం అనిశ్చితం. ఒకరోజు అది కచ్చితంగా అది ఇండియాకు వస్తుంది. మేము పాకిస్థాన్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలిచి ఛాంపియన్‌లమయ్యాము. ప్రతిదీ రికార్డులో ఉంది. ట్రోఫీ మాత్రమే లేదు. తెలివైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను” అని సైకియా చెప్పారు.
దుబాయ్‌లో ట్రోఫీ ప్రదానం కూడా గంటకు పైగా ఆలస్యం అయింది. తర్వాత ఎటువంటి వివరణ లేకుండా ట్రోఫీని మైదానం నుంచి తొలగించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీ లేకుండా తమ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంది. ఇలా జరగడం క్రికెట్ చరిత్రలో మొదటిసారి. ట్రోఫీని తిరిగి ఇవ్వాలని BCCI అధికారికంగా డిమాండ్ చేసినప్పటికీ, భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో భారత ఆటగాళ్ళు స్వయంగా వచ్చి దానిని తీసుకోవాలని నఖ్వీ ఇప్పటికీ పట్టుదలతో ఉన్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.
READ ALSO: Mali Bamako JNIM: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?