ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) సహరించడంతో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
టీమిండియా ఆసియా కప్ 2025 ట్రోఫీ కైవసం చేసుకోవడంపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తన సంతోషాన్ని పంచుకుంది. టోర్నీ ఆద్యాంతం అద్భుత ఆటతో ఆకట్టుకున్న భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.21 కోట్ల నజరానాను బీసీసీఐ ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి బీసీసీఐ అందించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
Also Read: Asia Cup 2025: పాకిస్థాన్ కెప్టెన్‌కు ఎంత బలుపు.. వీడియో వైరల్! ఎక్కడో కాలినట్టుంది సీనా
ఇక 2025 ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రూ.2.65 కోట్లను ప్రైజ్‌మనీగా ఇచ్చింది. రన్నరప్ పాక్‌కు రూ.66.75 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కాయి. గత ఆసియా కప్‌తో పోలిస్తే ఈసారి విజేతకు అదనంగా 50 వేల డాలర్లు దక్కాయి. విజేతగా నిలిచిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఫాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘కంగ్రాట్స్ టీమిండియా’ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.