విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి మరియు ఆయన భార్య రూపాలి బరూవా ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆశిష్ విద్యార్థి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ అసలు ఏం జరిగిందో వివరించారు. శుక్రవారం రాత్రి గువహటిలో వారు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఒక బైక్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రూపాలికి గాయాలయ్యాయని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read : Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?
తమ క్షేమం కోసం ప్రార్థించిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రమాదంలో బైకర్ కూడా క్షేమంగానే ఉన్నాడని ఆశిష్ పేర్కొన్నారు. తెలుగులో ‘పోకిరి’, ‘చిరుత’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆశిష్ విద్యార్థి, 2023లో రూపాలిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.