ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం వైమానిక దాడులను ఖండించారు. అనంతరం పాకిస్థాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఒవైసీ గుర్తు చేశారు. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ సిఫారసు చేసిన పాక్ వైఖరి ఏంటి? అని ప్రశ్నించారు.
READ MORE: Iran Russia Meeting: యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి!
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను పూర్తిగా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమాన్ని కప్పిపుచ్చేందుకే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందని భావించడంలేదని స్పష్టం చేశారు. అమెరికా చర్యలు కేవలం అంతర్జాతీయ చట్టాలు, ఐరాస చార్టర్‌ను మాత్రమే కాకుండా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏ దేశంపైనా యుద్ధం చేయరాదని ఆయన గుర్తుచేశారు. ఇజ్రాయెల్ అణ్వాయుధాల విషయంలో అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఒవైసీ ప్రశ్నించారు. “700 నుంచి 800 అణు వార్‌హెడ్‌లు కలిగి, ఎన్‌పీటీపై సంతకం చేయని, ఐఏఈఏ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇన్‌స్పెక్టర్లను అనుమతించని ఇజ్రాయెల్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన అన్నారు.