Asad Ahmed: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అతిక్ అహ్మద్ తన 19 ఏళ్ల కుమారుడి పెళ్లిని తన సోదరి కుమార్తెతో నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ హత్యకు గురికావడంతో పెళ్లి ఆలోచనలు వాయిదా పడ్డాయి. ఉమేష్ పాల్ హత్యలో అసద్ ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరోపించారు. అతని తండ్రి అతిక్ కూడా ఈ కేసులో నిందితుడు.
ఫిబ్రవరి 24 హత్య తర్వాత పరారీలో ఉన్న అసద్‌ను యూపీ పోలీసులు గురువారం ఝాన్సీలో గుర్తించారు. పోలీసుల కథనాల ప్రకారం, గులామ్ అనే సహచరుడితో కలిసి వచ్చిన అసద్, అతనిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్, గులాం ఇద్దరూ చనిపోయారు. గత నెలన్నర రోజులుగా అసద్, గులామ్‌లను పట్టుకునేందుకు ఎస్టీఎఫ్ బృందం ప్రయత్నిస్తోందని యూపీ ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్ తెలిపారు.
Read Also: Amit Shah: బెంగాల్‌లో హిట్లర్ తరహా పాలన.. దీదీ సర్కారును గద్దె దించేది బీజేపీనే..
ఉమేష్ పాల్ హత్య కేసు
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో సాక్షి ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటి బయట కాల్చి చంపబడ్డాడు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, అతని కుమారుడు అసద్, పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 2005 రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ కూడా నిందితుడు. అతిక్ మరో ఇద్దరు కుమారులు మహ్మద్ ఉమర్, అలీ అహ్మద్‌లు వేర్వేరు కేసుల్లో జైలులో ఉండడం గమనార్హం. అతిక్ పెద్ద కుమారుడు మహ్మద్ ఉమర్ దోపిడీ కేసులో నిందితుడిగా లక్నో జైలులో ఉన్నాడు. హత్యాయత్నం కేసులో అలీని ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలులో ఉంచారు.