Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా శుక్రవారం బీర్భూమ్ చేరుకున్నారు. బెంగాల్‌లో బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో టీఎంసీ సర్కారు విమర్శనాస్త్రాలు సంధించారు. మమతా బెనర్జీ సర్కారు రాష్ట్రంలో హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తోందని ఆయన మండిపడ్డారు. బీజేపీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో గెలిపించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. బెంగాల్‌లోని 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 35 చోట్ల తమను గెలిపిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో 35 స్థానాలు మావే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Arvind Kejriwal: చదువంటే ఇష్టం లేని.. దేశ వ్యతిరేక శక్తులు సిసోడియాను జైలుకు పంపాయి..
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసను ప్రస్తావించిన అమిత్ షా.. తాము అధికారంలో ఉంటే ఇలా జరిగేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి శోభాయాత్రలను జరుపుకోకూడదా? శోభాయాత్రలపై దాడులు చేస్తారా? అని ప్రశ్నలు వేశారు. ఈ దారుణానికి కారణం ముఖ్యమంత్రి అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదన్నారు. మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు పాల్పడుతున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడగలిగేది బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మరోసారి నరేంద్ర మోదీయే దేశానికి ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని తదుపరి ముఖ్యమంత్రిగా చేయాలన్నదే మమతా బెనర్జీ లక్ష్యమని షా ఆరోపించారు. అవినీతిలో మునిగిన టీఎంసీని బీజేపీయే ఓడించగలదని అమిత్ షా చెప్పారు.
ఇదిలా ఉండగా.. అమిత్ షా వ్యాఖ్యలను అధికార తృణమూల్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అమిత్ షా మాటలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది.