Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజు భవ్య రామాలయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని పలు రంగాలకు చెందిన 7000 మందికి పైగా అతిథులు, లక్షలాది మంది రామభక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రాముడు అయోధ్యలో కొలువుదీరే సమయంలోనే తమ బిడ్డలకు జన్మనివ్వాలని చాలా మంది తల్లులు భావించారు. ఇదే ముహూర్తంలోనే డెలివరీలు జరిగేలా చూసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ కనిపించింది. తమకు రామ మందిర ముహూర్తంలోనే సిజేరియన్ చేయాలని డాక్టర్లను కోరారు.
తాజాగా అయోధ్య రామ మందిరంలో రాముడు కొలువయ్యే సమయానికే 42 ఏళ్ల మహిళ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర థానే నగరంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న సదరు మహిళ జనవరి 23న డెలివరీ జరగాల్సి ఉన్నా.. రామ మందిర ప్రారంభోత్సవమైన జనవరి 22న డెలివరీ చేయాలని డాక్టర్‌ని కోరింది. థానేలోని నౌపడ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో మధ్యాహ్నం 12.30 గంటలకు శిశువు జన్మించినట్లు డాక్టర్ తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో జన్మించిన పిల్లలు “మర్యాద పురుషోత్తముడి” లక్షణాలతో జన్మిస్తారని తల్లులు భావించారు.