ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. బలవంతపు అరెస్ట్ లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను.. అయితే ఈడీ కఠిన చర్యలు తీసుకోకూడదని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సురేశ్ కైత్ నేతృత్వంలోని ధర్మాసరం ఇవాళ ఈ కేసుపై విచారణ చేయనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకూ 9 సమన్లు జారీ చేసింది. తాజాగా తొమ్మిదో సమన్లు పంపిన ఈడీ.. నేడు విచారణకు పిలిచింది. అంతకుముందు.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ సమన్లన్నింటిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. అయితే, ఆయనకు బుధవారం నాడు కోర్టు నుంచి తక్షణ ఉపశమనం దొరకలేదు..
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ తొమ్మిదో సారి నోటీసులు ఇచ్చింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లపై పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరిలు వాదించగా.. పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ సమర్పించిన సమన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం సమన్లపై సమాధానం ఇవ్వాలని ఈడీకి రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: RCB vs CSK: చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
అయితే, నేడు కేజ్రీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. సమన్ల దాటవేతపై ఈడీ కేసు ఫైల్ చేసింది. పాలసీ రూపకల్పన, ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు అంశాలపై ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) కోరుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది.