CSK vs RCB Head To Head IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే. ఏడాది తర్వాత ధోనీ, రెండు నెలల విరామం అనంతరం విరాట్ బరిలోకి దిగి అభిమానులను అలరించనున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి పరిశీలిస్తే.. సీఎస్‌కేదే పైచేయిగా ఉంది. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 మ్యాచ్‌లు గెలిస్తే.. బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మిగిలిన 9 మ్యాచ్‌లలో సీఎస్‌కేదే విజయం. 2008లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేని ఆర్‌సీబీ ఓడించింది.
Also Read: IPL 2024: నేను సర్ఫరాజ్ ఖాన్ తండ్రితో కలిసి ఆడా: రోహిత్ శర్మ
సీఎస్‌కేపై ఆర్‌సీబీ అత్యధిక స్కోరు 218 కాగా.. అత్యల్ప స్కోరు 70 పరుగులు. ఆర్‌సీబీపై సీఎస్‌కే అత్యధిక స్కోరు 226, అత్యల్ప స్కోరు 86 పరుగులు. గత సీజన్‌లో సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు ఒక్క మ్యాచ్‌లోనే తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. సీఎస్‌కేతో జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. మరి ఈసారైనా వరుస ఓటములకు ఆర్‌సీబీ బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి. సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది.