ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అరుంధతి రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు’ అని చెప్పారు.
‘ప్రధాని మోడీని కలవడం మెమొరబుల్ మూమెంట్. ప్రధాని మోడీని కలిసినప్పుడు మా అమ్మకి మీరు హీరో, ఈ విషయం చెప్పడానికే నాకు నాలుగైదు సార్లు అమ్మ ఫోన్ చేసిందని చెప్పాను. నా హీరోని నువ్వు ఎప్పుడు కలుస్తున్నావు? అని అమ్మ పదేపదే అడిగిందని ప్రధానికి చెప్పాను. ప్రధాని కూడా సంతోషం వ్యక్తం చేశారు. అన్ని కండిషన్స్ లో టీమ్ అందరం జట్టు విజయం వైపు నడిచాం. వెదర్ కండిషన్స్, మ్యాచ్ స్ట్రాటజీ, ఫిట్నెస్, ఫుడ్, హెల్త్ కండిషన్.. అన్ని విషయాల్లో టీమ్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. అద్భుత కోచ్ అమోల్ మజుందార్. ఆయన సూచనలు, సలహాలు వల్లే వరల్డ్ కప్ గెలుపు సాధ్యమైంది’ అని అరుంధతి రెడ్డి చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో అరుంధతికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మొదటి మ్యాచ్ నుంచి ప్లేయింగ్ 11లో మార్పులు లేకుండానే కంటిన్యు అవడంతో బెంచ్‌కే పరిమితం అవ్వల్సి వచ్చింది.
క్రికెటర్ అరుంధతి రెడ్డి తల్లి భాగ్య మాట్లాడుతూ… ‘చిరకాల వాంఛ తీరింది. ప్రపంచకప్ భారత మహిళల చెట్టు గెలవడం చాలా సంతోషం ఇచ్చింది. ఎంతో కటోర శ్రమ పట్టుదలతో భారత మహిళా జట్టు టీం సభ్యులందరూ కలిసి ప్రపంచకప్ తెచ్చారు. ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. అరుంధతి రెడ్డిని చూసి తల్లి దండ్రులుగా మేము ఎంతగానో గర్వ పడుతున్నాము. మా శ్రమ కూడా ఎంతో ఉంది. ప్రధాని మోడీ అంటే ఎంతో గౌరవం నాకు. నేను ఆయనకు బిగ్ ఫాన్. నా కూతురు అరుంధతి మోడీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతగానో గర్వపడ్డా. మహిళలు ప్రపంచకప్ గెలవడం వల్ల మహిళా క్రికెట్ మరింత ముందుకు వెళుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.